పాక్ ఓపెనర్‌ ఫకార్ జమాన్‌ మరో రికార్డ్..!

పాకిస్థాన్ సంచలన ఓపెనర్ ఫకార్ జమాన్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో ఇటీవల జరిగిన నాలుగో వన్డేలో డబుల్ సెంచరీ బాదిన జమాన్.. తాజాగా ఐదో వన్డేలోనూ 85 పరుగులు చేసి.. వన్డేల్లో వేగవంతంగా 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దిగ్గజ క్రికెటర్‌ వివియన్ రిచర్డ్స్, కేవిన్ పీటర్సన్, డికాక్‌ తదితరులు కెరీర్ ఆరంభంలో 21 ఇన్నింగ్స్‌లో ఈ వెయ్యి పరుగుల మార్క్‌ని అందుకోగా.. ఫకార్ జమాన్ కేవలం 18 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. పాకిస్థాన్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా ఫకార్ జమాన్ ఇటీవల రికార్డుల్లో నిలిచాడు. 

fakhar zaman fastest to reach 1,000 odi runs
ఇంగ్లాండ్‌ వేదికగా గత ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీతో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఫకార్ జమాన్.. ఆ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లాడి మొత్తం 252 పరుగులు చేశాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్‌పై అతను సమయోచిత శతకం బాదడంతో ఈ ఓపెనర్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత.. వన్డే జట్టులో నమ్మదగిన ఆటగాడిగా కొనసాగుతున్న జమాన్.. తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ పరుగుల మోత మోగిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఐదు వన్డేల్లో జమాన్ వరుసగా 60, 117 నాటౌట్, 43 నాటౌట్, 210 నాటౌట్, తాజాగా చివరి వన్డేలోనూ 85 పరుగులు చేశాడు.

Comments